13 జులై, 2014

మరోసారి...


నెరిసీనెరియని కురులు
అరమూసిన కనురెప్పల మైమరపు
అరవిచ్చిన పెదాలలో తీయని మెరుపు
కరిగిన విరహం
చిరుచెమటై జారుతూ...
మరోసారి కనుగొన్నా, అందం
చిరునామా


6 జులై, 2013

ఒక తడి ఊహ


వాన చినుకుల సవ్వడిలో

ఒక గమ్మత్తైన లయ

ఓ పురానాదం

ప్రతిసారీ సరికొత్తగా

తడితెమ్మెర తాకిడిలో

ఊహకందని భావమేదో

ఝల్లుమనిపిస్తూ...

కురిసిపోయే మేఘానికి

ఇంతటి కవిత్వం నేర్పిందెవరో?

ఆ కవికులగురువే కాబోలు!

11 మార్చి, 2013

వారానికి ఒక్కరోజు


ఆ రోజు
సూర్యుడుకూడా బద్ధకంగా నిద్దర లేస్తాడు

గాలి
మత్తుగా ఒళ్ళువిరుచుకుని
ఆగి ఆగి కూస్తున్న బుల్‌బుల్‌పిట్ట అరుపొకటి మోసుకుంటూ 
సాగిపోతుంది

రోడ్లన్నీ ఎండాకాలపు సెలయేళ్ళవుతాయి
వారమంతా ఎక్కడికి వలసెళ్ళిపోయిందో!
నిశ్శబ్దం
నిర్జన వీధుల్లో బేఫికర్ షికారు చేస్తుంది
తోడుగా
ఎక్కడో రేడియోలోంచి వచ్చే పాత సినిమా పాట

వాన వెలసిన సాయంత్రంలా
బడి ప్రాంగణం

హడావిడి పడకున్నా
ఆ రోజుకూడా
క్రమం తప్పక పనిచేసేవి రెండే
ఒంట్లో గుండె
ఇంట్లో అమ్మ

17 ఫిబ్ర, 2013

దేహీ!


కొందరి దేహం సంగీతానికి

కొందరి దేహం కవిత్వానికి

మురళీ

పాళీ


మరి నా దేహం?

సందేహానికి

దేహళీ

26 అక్టో, 2012

సముద్రంలో కప్ప

నేనో కప్పని.
నన్నందరూ "నూతిలో కప్ప" అని పిలిచేవారు. ముద్దు పేరనుకున్నా.
అది ఎగతాళని ఎప్పుడో తెలిసింది. ఉక్రోషం ముంచుకొచ్చింది.
ఎగురుకుంటూ పోయి సముద్రంలో పడ్డా.
దీం తస్సాదియ్యా, ఇదెక్కడి సముద్రం ఇది! హోరెత్తించే అలలు ఉక్కిరిబిక్కిరి ఆటుపోటులు.
కప్పలెప్పుడూ నూతిలోనే ఉండాలి - ఆలస్యంగా తెలుసుకున్న నిజం
ఇక ఇహనో ఇప్పుడో ఊపిరాగిపోతుంది

9 ఆగ, 2012

కవిత్వమంటే


మాటకి మౌనానికి మధ్య ఉండేది.

25 జులై, 2012

వెఱ్ఱి చేప!


వలను తానె అల్లుకుంది వెఱ్ఱిచేప, తానే

వలలోకి దూకింది వెఱ్ఱిచేప

                                                   వలను తానె||


వలలోపల చిక్కుకొని

గిలగిలమని కొట్టుకొని

బలే! బలే! అనుకుంది వెఱ్ఱిచేప, తన

తెలివికదే మురిసింది వెఱ్ఱిచేప

                                                  వలను తానె||

ఓపికంత పోయాక

ఊపిరందకున్నాక

ఓపలేక ఏడ్చింది వెఱ్ఱిచేప, తనను

కాపాడేదవరంది వెఱ్ఱిచేప
                                                  వలను తానె||

తెలివితకువ చేపను కని

మొలకనవ్వు నవ్వుకొని

చేప దీసి బుట్టనేసె జాలరోడు, మరో

చేప కోస మెదురుచూసె జాలరోడు

చేప దీసి బుట్టనేసె జాలరోడు, మరో

చేప కోస మెదురుచూసె జాలరోడు, వీడు

జాలరోడు కాడు వట్టి మాయలోడు, వీడు

జాలరోడు కాడు వట్టి మాయలోడు!