27 జులై, 2009

ఓ ప్రేమలేఖ

.
ప్రియా,

ఇలా నేను పిలవడం ఆశ్చర్యం కలిగిస్తోంది కదా. నాకు తెలుసు. నాక్కూడా వింతగానే ఉంది మరి. ఇంతకు ముందు ఎప్పుడూ యిలా పిలవలేదు. అసలు మనం ఎప్పుడైనా ఉత్తరాలు రాసుకుంటేగా. ప్రేమలేఖలు రాసుకోడానికి మనం ప్రేమికులం కాదు, మొగుడూపెళ్ళాలం. మరిప్పుడేమిటి యిలా?...అది చెప్పడానికే యీ ఉత్తరం.

ఒంటరిగా ఉన్నా కదా ఉబుసుపోవడం లేదు. మొన్న రాత్రి, ఏదో పుస్తకం తీసాను. ఓ నవల. ఎప్పుడో కాలేజీ రోజుల్లో చదివినదే. అప్పట్లో తెగ నచ్చేసింది. అందుకే మళ్ళీ చదువుదామనుకున్నా. మొత్తం పూర్తిచేసేసరికి అర్థరాత్రి దాటిపోయింది. కానీ తెలుసా, ఇప్పుడు నాకది అస్సలు నచ్చలేదు! ఎందుకో మరి. రెండు ముక్కల్లో చెప్పాలంటే, నవలానాయకుడు తన సోల్ మేట్ కోసం చేసే అన్వేషణ, అది ఫలించి ఆమెని కలుసుకోవడం, ఆపైన వాళ్ళిద్దరూ గడిపిన జీవితం... ఇదీ కథ. ఇది చాలావరకూ రచయిత ఆత్మకథే. అందుకే ఇందులో నిజాయితీ లేదనలేను. ప్రేమ గురించి ఇందులోని మాటలు అప్పట్లో నన్ను ఉర్రూతలూగించాయి కూడా! కాని ఇప్పుడు అవే సిల్లీగా అనిపించాయ్. కాస్తంత చిరాకు తెప్పించాయ్. మరింత చిర్రెత్తించిన విషయం మరొకటి ఉంది. తర్వాత చెప్తాను. పుస్తకం పూర్తయిన దగ్గరనుంచీ ఆలోచన మొదలయ్యింది, ప్రేమ గురించి. అదింకా తెగటమే లేదు!

మనం చాలా విషయాలగురించి ఇంతకుముందు వాదులాడుకున్నాం కానీ, యీ ప్రేమ గురించి ఎప్పుడూ మాట్లాడుకోనే లేదు ఎందుకో! అసలు ప్రేమంటే ఏమిటని నేనుకూడా ఎప్పుడూ ఇంతగా ఆలోచించలేదు. అదే ఆశ్చర్యం! ఎడాపెడా సినిమాల్లోనూ పుస్తకాల్లోనూ ఎక్కడపడితే అక్కడే కనిపిస్తుంది కదా యీ "ప్రేమ". దీనిగురించి ఎప్పుడూ ఎందుకు ఆలోచించలేదు చెప్మా?!
మన తెలుగు సినిమాల్లో ప్రేమ గురించి ఆలోచించేందుకు పెద్దగా ఏం లేదు నిజమే. కానీ అక్కడక్కడా ఏవో వచ్చాయి. వాటిల్లో కొన్ని ఇప్పుడు గుర్తుకొస్తున్నాయ్. ఒకటి మేఘసందేశం. దాన్లో నాగేశ్వర్రావుకి జయప్రద మీద కలిగినది ప్రేమా పిచ్చా? రెండిటికీ తేడాలేదు అని చాలామంది అంటారు. మరైతే ఆ ప్రేమని మాత్రం అంతగా గ్లోరిఫై చేసి తక్కిన రకాల పిచ్చిలని రోగాలంటూ వాటికి మాత్రం వైద్యం చెయ్యాలనుకోవడం ఎందుకు?
ఇక మరోచరిత్ర, అది మరో చెత్త! అసలు కలిసి ఉండకుండా ఒకరి మీద ఒకరికి ప్రేమ ఎలా పుడుతుంది?! చూడగానే కలిగే తొలిచూపు ప్రేమలు మేఘాలు రాసుకున్నప్పుడు వచ్చే మెరుపుల్లాంటివి కదూ. ఎంత ఓల్టేజీ ఉంటే ఏం, అవి క్షణికాలు కావా!

సరే, సినిమాల గురించి వదిలేద్దాం. ప్రేమ గురించి ఎన్ని పుస్తకాలు రాలేదని! పుస్తకాల్లో చాలా రకాల ప్రేమలే కనిపిస్తాయి. కానీ ఆలోచిస్తూ ఉంటే ఇవన్నీ ముఖ్యంగా మూడు వర్గాలు అనిపిస్తుంది.

ఒకటి - అసలు అదేమిటో నిర్వచించ లేక, దాన్ని రకరకాలుగా వర్ణిస్తూ, ఎక్కడా లేని ప్రేమకోసం తపిస్తూ, లేదా ఎవరో ఎక్కడో ఉన్న సోల్ మేటు కోసం అన్వేషించే ప్రేమ. ఇది ఎండమావిలో నీళ్ళు వెతకడం లాంటిది! అన్నీ ఉన్నా ఏదో కావాలని లేనిదానికోసం అర్రులు చాచే మనస్తత్వం ఉన్నవాళ్ళు ఇలాంటి ప్రేమ పిచ్చిలో పడతారు.
ఇక రెండోది - తొలిచూపు ప్రేమ. ఇది ఎందుకు కలుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. అలా చెప్పలేకపోవడమే దాని గొప్పదనమట కూడానూ! పైగా ఇలాంటి ప్రేమలో పడ్డవాళ్ళని ఎందుకు ప్రేమిస్తున్నారో అడిగితే ఏమంటారో తెలుసా? "నేను జిలేబీని ఎందుకిష్టపడతానో అడగని నన్ను, అతన్ని/ఆమెని ప్రేమిస్తే ఎందుకు ప్రేమిస్తున్నానని అడుగుతారేం" ఇది వాళ్ళ సమాధానం. అక్కడికేదో వాళ్ళ ప్రేమికుడు(రాలు) జిలేబీ అయినట్టూ, వీళ్ళు వాళ్ళని కొరుక్కు తినేసేటట్టూనూ. అవతల ఉన్నది ఒక ప్రాణమున్న మనిషనీ, వాళ్ళని ప్రేమించడానికీ ప్రాణం లేని వస్తువులని ఇష్టపడ్డానికీ చాలా చాలా తేడా ఉన్నదనీ వీళ్ళకి బోధపడదు. వీళ్ళని కమ్ముకున్న ప్రేమ మైకం అలాంటిది మరి.
సరే మూడో రకం - వీళ్ళు పెళ్ళి చేసుకుని ప్రేమించేవాళ్ళు. ఎవళ్ళనీ? సొంత మొగుడినో/పెళ్ళాన్నో కాదు. వేరేవాళ్ళని. వీళ్ళకి ఎప్పుడూ సంసారంలో లేనిదేదో పరాయివాళ్ళ సాహచర్యంలో దొరుకుతుంది. అదేమిటి అంటే చెప్పడం కష్టమే. ఇలాంటి సందర్భాలలో కట్టుకున్న మొగుడో/పెళ్ళమో ఒక చచ్చు దద్దమ్మే అవుతుంది ఎప్పుడూను. ఇక అక్కణ్ణుంచి ఆ బంధాన్ని ఎలా తెంచుకోవాలా అన్నదే ఆలోచన. ఆ పరాయివాళ్ళతో బంధం పోనీ శాశ్వతమా అంటే అదీ అనుమానమే. ఇలాంటి కథలు చదివి చదివీ అసలు మనని నచ్చేవాళ్ళని మనం ఎప్పటికీ పెళ్ళి చేసుకోలేం (లేదా పెళ్ళిచేసుకున్న వాళ్ళని ప్రేమించలేం) అనే అనుమానం కలగక మానదు. ఎందుకంటే అలా పెళ్ళి చేసుకున్నవాళ్ళని ప్రేమించే వాళ్ళు ఒకవేళ ఉన్నా, వాళ్ళ జీవితాలకి కథలయ్యే అర్హత ఉండదు మరి.

ఇవికాక ఇంకా మరికొన్ని రకాలు కూడా ఉన్నాయనుకో. స్నేహితులనో, కళాకారులనో ప్రేమించేవాళ్ళు, వేరే కులం వాళ్ళని ప్రేమించేవాళ్ళూ, పేదవాళ్ళని ప్రేమించేవాళ్ళు ఇలా. ఇవన్నీ తొలిప్రేమ కావచ్చు, పరిచయం ప్రేమగానూ మారవచ్చు. అయితే నాకు అర్థంకాని విషయం ఒక్కటే. అక్కడంతా ఉన్నది ఇష్టమా? ప్రేమా? రెండిటికీ ఏమిటి తేడా? ఎవ్వడూ ఈ సందేహాలని తీర్చిన పాపాన పోలేదు ఇంతవరకూ!

అయినా ప్రేమగురించి తెలుసుకోవడానికి పుస్తకాలు చదవడం శుద్ధ దండగ అని నాకనిపిస్తుంది. ప్రేమ గురించి తెలియాలంటే ప్రేమించాలి, అదొక్కటే మార్గం. నా మటుక్కి నాకు ప్రేమంటే, మనిద్దరి మధ్యన ఉన్నదే ప్రేమ. మనం ప్రేమించి పెళ్ళి చేసుకున్నామా? పెళ్ళి చేసుకుని ప్రేమించుకున్నామా? అందరూ మొదటిదే అనుకుంటారు. కానీ అసలు నిజం మనకే తెలుసు. మనం పెళ్ళి చేసుకున్న తర్వాతే ప్రేమించుకున్నాం. ప్రేమ లేకుండా ఇన్నేళ్ళు ఎలా కలిసి ఉండగలం? పెళ్ళి సమాజం మన మీద తెచ్చే వత్తిడివల్లనే మనం కలిసి ఉంటాం, అని కొందరంటారు తెలుసా! బహుశా, అలా సమాజం వత్తిడి మూలంగానే కలిసి ఉండేవాళ్ళు అనే మాటలవి. మహా అయితే మొదట్లో ఒక రెండేళ్ళు అలా జరగవచ్చేమో. ఆ తర్వాత? ఇంత కాలం మనిద్దరం ఇంత ఆనందంగా జీవితాన్ని గడిపగలిగామంటే దానికి ఏమిటి కారణం? వత్తిడా? ప్రేమా? కలిసి ఆనందంగా జీవించడం కన్నా ప్రేమకి వేరే అర్థం ఏముంది? ఎప్పుడైతే మనం పెళ్ళి చేసుకున్నామో, అప్పటినుంచీ నేను "నా"కోసం కాకుండా "మన"కోసం బతకడం మొదలుపెట్టాను కదా. దీనికోసం "నాది" అంటూ కొంత కాలాన్ని, వ్యక్తిత్వాన్ని, అన్నిటినీ వదులుకో వలసి వచ్చింది కదా. అయినా అది నాకు ఆనందాన్ని ఇచ్చింది. ఆ ఆనందమే కదూ ప్రేమంటే!
కొంతమంది అంటారూ, ఎవరి వ్యక్తిత్వాన్ని వాళ్ళు సంపూర్ణంగా కాపాడుకుంటూ కలిసి జీవించడమే అసలైన ప్రేమట. అహంకారం పూర్తిగా నెత్తినెక్కిన వాళ్ళు చెప్పే మాటలవి. కలిసి జీవించడం అంటే తెలియనివాళ్ళు వాళ్ళు. ఇద్దరు మనుషులు కలిసి ఆనందంగా బతకాలంటే ఇద్దరూ ఎంతో కొంత అహాన్ని వొదులుకోక తప్పదని మనిద్దరికీ తెలుసు. అది చూసే వాళ్ళకి "ఎడ్జస్టుమెంట్" గా అనిపించవచ్చు, "కాంప్రమైజ్" అని కూడా అనుకోవచ్చు. కాని అది మనం మనస్పూర్తిగా చేస్తున్నప్పుడు, అలా చెయ్యడంలో ఆనందం ఉన్నప్పుడు, దాన్ని ఏ పేరుతో పిలిచినా, అది మంచిపనే కదా. ఇది వాళ్ళకి బోధపడదు.
మనలా ఒకొరికొరు కలిసి బతకడంలో ఆనందం పొందనివాళ్ళు కూడా ఉండవచ్చు. ఒకళ్ళు మరొకళ్ళని డామినేట్ చేసి జులుం చెలాయించే వాళ్ళూ ఉండవచ్చు. నేను కాదనను. అయితే అదేం చిత్రమో కాని అలాంటివాళ్ళ గురించే కథలు రాస్తారు! జరిగేది అదొక్కటే అని అందరూ అనుకుంటారు కూడాను.

ఈ మధ్యన మరో వింతకూడా వినిపిస్తోంది తెలుసా. అది "కలిసి జీవించడం". అంటే వాళ్ళు పెళ్ళి చేసుకోరట. ఇద్దరూ ప్రేమించుకొని కలిసి ఉంటారట. అంత ప్రేమించుకున్న వాళ్ళు పెళ్ళి చేసుకోవడానికి ఏం? అంటే అది వాళ్ళకి అనవసరం అంటారు. వాళ్ళెవళ్ళో పెళ్ళి చేసుకోకుండా కలిసి ఉంటే నాకేంటి మధ్యన, మహారాజులా ఉండమను. కానీ దాన్ని వాళ్ళు ప్రేమ అంటేనే నాకు చిరాకు వస్తుంది. వాళ్ళు పెళ్ళి చేసుకోకపోవడానికి కారణం దాన్ని ఒక బంధంగా అనుకోవడమే. పెళ్ళి చేసుకున్నాక విడిపోవాలంటే చాలా తతంగం. ఆ బాదరబందీ లేకుండా ఉండేందుకే యీ "కలిసి ఉండడం". జీవితాంతం కలిసి ఉండగలం అనే నమ్మకం లేనివాళ్ళది అది ప్రేమేంటి? ఇందాకా ఆ నవల గురించి చెప్పినప్పుడు తర్వాత చెపుతానన్నానే, అది ఇప్పుడు గుర్తుకు వచ్చింది. చెప్తా విను. ఆ సదరు నవలా రచయిత కొన్నేళ్ళు తన soul mateతో జీవించిన తర్వాత ఆవిడకి విడాకులిచ్చేసాడు తెలుసా! సరే ఇస్తే ఇచ్చాడు, ఆ తర్వాత ఏమిటన్నాడో తెలుసా?

"lovers don't have to stay married forever to be lifetime soul mates."

నేను ఆ నవల చదివి ఒకప్పుడు ఇష్టపడి ఉండకపోతే ఈ మాటలకి పడీపడీ నవ్వేవాడినే. కాని ఇప్పుడు నాకు విపరీతమైన కోపం చిరాకు వచ్చాయి ఇది చదివి. అసలీ పుస్తకాలు రాసేవాళ్ళందరూ పేరూ డబ్బూ సంపాదించడానికే ఇవన్నీ రాస్తారేమో! వీటిని చదివిన అమాయికులు అందులో ఉన్నదే ప్రపంచమనుకొని, ప్రేమించడం అంటే ఏమిటో తెలీక, ఒక వ్యక్తిని (జీవితాంతం) ప్రేమించడం చేతకాక పాపం వెఱ్ఱివాళ్ళై పోతూ ఉంటారు.

మనిషిలో పెరిగిపోయిన అహంకారం ఉందే, అదంతా మనిషి మెదడు చేస్తున్న నిర్వాకం. "స్వేచ్ఛ" అనే పేరుతో కొంతమంది తమ అహంకారాన్ని ప్రకటిస్తూ ఉంటారు. స్వేచ్ఛ ఉన్నదే నిజమైన ప్రేమ అని కొందరి ఉవాచ. ప్రేమ ఉన్న చోట స్వేచ్ఛ ఉండదూ? కొంత ఉంటుంది. కొంత ఉండదు. అలా కొంత లేకపోవడం మంచిదే కాని చెడ్డది కాదు. స్వేచ్ఛ కన్నా కూడా ప్రేమ గొప్పది. అహంకారం ఆ విషయాన్ని కప్పేస్తుంది.
అసలు మనిషి జీవితానికి ఏమిటి పరమార్థం అని కొందరు విపరీతంగా ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళదో రకమైన పిచ్చి. ఇది కూడా మెదడులోని అహంకారం మూలంగా వస్తున్న ఆలోచనే. ఏ ప్రాణి జీవితానికైనా, పునరుత్పత్తికి మించిన పరమార్థం ఏముంది? మనిషికైనా అంతే! అది కాక వేరే ఏదో ఉంది అన్న ఆలోచన, మహా చెడ్డ అహంకారంతో మెదడు చేసే వొట్ఠి మాయ! అంతే! పిల్లల్ని కని చక్కగా పెంచి వాళ్ళకో మంచి జీవితాన్ని ఇవ్వడం కన్నా మనిషి జీవితానికి పరమార్థం ఏది? దానికి మొగుడూ పెళ్ళాల మధ్య ప్రేమ చాలా అవసరం. అంతకు మించిన ప్రేమ మరేముంది? ఈ విషయం మనకన్నా బాగా మరెవ్వరికీ తెలియదు. అవునా? అవును.
కాదు అంటే మనం మళ్ళీ కలుసుకున్నప్పుడు వాదించుకుందాం, సరేనా? ఎప్పుడెప్పుడు కలుస్తానా అని ఉంది నాకు. ఒంటరిగా ఎంత కాలం ఇలా నేను బతకాలి? ఎప్పటికైనా మళ్ళీ మనం కలుస్తాం. ఆ నమ్మకం నాకుంది. ఆ నమ్మకంతోనే బతుకుతున్నాను. ఆ నమ్మకంతోనే ప్రాణం వదులుతాను. అప్పుడు వచ్చి ఆ పైన ఎక్కడున్నా తప్పకుండా కలుసుకుంటాను. మరో జన్మ అంటూ ఉంటే, మళ్ళీ మనం ఇలా మొగుడూపెళ్ళాలుగానే పుడతాం. అప్పుడూ ఇలాగే పెళ్ళి చేసుకొని జీవితాంతం ప్రేమించుకుంటాం. దానికోసమే వేచి చూస్తూ...

ప్రేమతో,
నీ...
.

15 జులై, 2009

సంపూర్తి

ఒక వాక్యం,

చివరి అక్షరం కాగితంపై ఒలికే దాకా

చివరి శబ్దం గాలిలో కలసిపోయే దాకా

పూర్తికాదు

దానికి అర్థం లేదు

అసలది వాక్యమే కాదు.

జీవితం కూడా అంతే?!

.