27 నవం, 2009

లోతు కవిత

.
చుక్క చుక్కకీ మధ్యన

చిక్కుకున్న చీకట్లో

ఏవేవో రహస్యాలు

పురాతనం సనాతనం

ఆకాశం ఎంత లోతు!
.

2 నవం, 2009

కార్తీక చందురుడు

.
పున్నమీ రాతిరిలోనా
పూసినా వెన్నెల పువ్వా
కన్నులా విందయినావుగా చందమామా

పూవులా పూసావూ
ముత్యమై మెరిసావూ
ఎన్ని కళలో నీకూ హే చందమామా

మబ్బు తెర కమ్మేస్తే
నిన్నేమొ మింగేస్తే
గుండెలో గుబులవుతుందీ ఓ చందమామా

నట్టనడి ఆకాశంలో
కొట్టుకొని పోతున్నావా
ఒంటరిగ నువ్వూ ఓ చందమామా

చుక్కలే కన రావు
దిక్కు తెన్నూ లేదు
ఎక్కడికి పోతావులే చందమామా

నాకు నువ్వేమవుతావు
నీకు నేనేమవుతాను
నాతోనె వస్తున్నావే నా చందమామా
.