26 అక్టో, 2012

సముద్రంలో కప్ప

నేనో కప్పని.
నన్నందరూ "నూతిలో కప్ప" అని పిలిచేవారు. ముద్దు పేరనుకున్నా.
అది ఎగతాళని ఎప్పుడో తెలిసింది. ఉక్రోషం ముంచుకొచ్చింది.
ఎగురుకుంటూ పోయి సముద్రంలో పడ్డా.
దీం తస్సాదియ్యా, ఇదెక్కడి సముద్రం ఇది! హోరెత్తించే అలలు ఉక్కిరిబిక్కిరి ఆటుపోటులు.
కప్పలెప్పుడూ నూతిలోనే ఉండాలి - ఆలస్యంగా తెలుసుకున్న నిజం
ఇక ఇహనో ఇప్పుడో ఊపిరాగిపోతుంది

9 ఆగ, 2012

కవిత్వమంటే


మాటకి మౌనానికి మధ్య ఉండేది.

25 జులై, 2012

వెఱ్ఱి చేప!


వలను తానె అల్లుకుంది వెఱ్ఱిచేప, తానే

వలలోకి దూకింది వెఱ్ఱిచేప

                                                   వలను తానె||


వలలోపల చిక్కుకొని

గిలగిలమని కొట్టుకొని

బలే! బలే! అనుకుంది వెఱ్ఱిచేప, తన

తెలివికదే మురిసింది వెఱ్ఱిచేప

                                                  వలను తానె||

ఓపికంత పోయాక

ఊపిరందకున్నాక

ఓపలేక ఏడ్చింది వెఱ్ఱిచేప, తనను

కాపాడేదవరంది వెఱ్ఱిచేప
                                                  వలను తానె||

తెలివితకువ చేపను కని

మొలకనవ్వు నవ్వుకొని

చేప దీసి బుట్టనేసె జాలరోడు, మరో

చేప కోస మెదురుచూసె జాలరోడు

చేప దీసి బుట్టనేసె జాలరోడు, మరో

చేప కోస మెదురుచూసె జాలరోడు, వీడు

జాలరోడు కాడు వట్టి మాయలోడు, వీడు

జాలరోడు కాడు వట్టి మాయలోడు!

28 మే, 2012

భ్రాంతిమదం

నిజానికి,
నేనొక కీటకాన్నే కాబోలు
ఇన్నాళ్ళూ భ్రమరాల మధ్య
పరిభ్రమిస్తూ
నేనూ ఓ భ్రమరాన్నే అని భ్రమ పడ్డాను.
నా వెఱ్ఱిగాని,
భ్రమరాన్నే కాని నేను
పువ్వు నవ్వాలని ఆశపడ్డం ఏమిటి!

5 మార్చి, 2012

ప్చ్...


చినుకు చినుకు ఎడమనున్న

చిటికెడంత పొడిదనం

కణం కణం నడుమలోన

కమ్ముకున్న శూన్యం

పదం పదం మధ్యంతా

పరచుకున్న నిశ్శబ్దం


జన్మానికి ఒక్కసారి చవి

చూసే అదృష్టం

ఉందో లేదో!

7 ఫిబ్ర, 2012

జీవగణితం

.
అరవై నిమిషాలని పేర్చి కలిపితే గంట కాదు.

ఒక గంటని అరవై ముక్కలు చేస్తే అరవై నిమిషాలు.

కాలమైన, కవిత్వమైనా, జీవితమైనా,

జీవమున్నదేదైనా...

ఇంతే!
.