21 ఏప్రి, 2010

ఓ విషాద నగరపు ప్రేమ కథ - ఒక పూర్తికాని అనువాదం

దీని ఇంగ్లీషు మూలం ఇక్కడ: http://disquietthoughts.blogspot.com/2008/09/sad-citys-sad-love.html

సుమారు ఏడాదిన్నరగా ప్రయత్నిస్తూ ఉంటే ఈ రూపానికి వచ్చింది.
ఇప్పటికి పూర్తయ్యిందని కాదు. ఎప్పటికీ పూర్తికాదని.

ఓ విషాద నగరపు ప్రేమ కథ
==================

అసలు మనం కలిసి కూర్చున్నదెక్కడ?

సముద్రపొడ్డున? వంతెన కింద?

కనీసం ఓ పార్కులో బెంచీ మీద?

ఊహూఁ...

అవును, ఏదో దురదృష్టం కమ్మినట్టు

మసకబారి జారిపోతున్న ఆ నదిని చూశాం

ఎక్కడో దూరంగా ఉందనుకున్నాం

జ్ఞాపకాల నిశ్శబ్దంలోకి సరస్సు జారుకుంటోందనీ

వంతెనలు కూలిపోతున్నాయనీ మనకి తెలుసు.

మనకసలు సముద్రమే లేదు

బిచ్చగాళ్ళకైనా ప్రేమికులకైనా,

అసలు మనం కలుసుకునే చోట బెంచీలే లేవు.


ఆకులు రాలడం, నది మరణించడం, మన ముఖాల పైపూత

గట్టిపడ్డం. అన్నీ మన కళ్ళముందే...

మన ప్రేమకి బలం లేదు తెలివీ లేదు.

అయినా ప్రేమించుకున్నాం,

నది మరణించినా సరస్సు మరపులోకి మాయమైనా.

వెన్నెలా

రాలిన ఆకుల రెపరెపలూ

ఏవీ లేక దిగాలుపడింది మన ప్రేమ.

అలా ఆ నది ధూళిలో

మన ప్రేమగీతం మరుగునపడిపోతే

హమ్మయ్యా! అయిపోయిందని హడావిడి వీడ్కోలు చెప్పేసుకున్నాం.


ప్రేమికులకూ బిచ్చగాళ్ళకూ

ఇంకా అక్కడ బెంచీలు లేవు.

సరస్సు కొండల్లోకి దూకేసింది,

ఆలోచిస్తే అదో మిస్టరీ.

మన ప్రేమని నిర్వచించిన ఆ నది

సముద్రాన్ని వెత్తుక్కుంటూ వెళ్ళిపోయింది.

పరస్పరం దాచుకున్న ఒక ఏదో బాధతో

పరాకుగా పారేసుకున్న మాటల నీడల్లో తచ్చాడుతూ

మూర్ఖుల్లాగా

నువ్వూ... నేనూ...

8 ఏప్రి, 2010

నల్ల మల్లెలు

నిన్న

హైవే మీద

వెన్నెల్లా మెరిసిపోతూ

అమ్మకానికి

రెండు మల్లెపూల గుత్తులు

రాత్రంతా

చీకటిని తాగీ తాగీ

తెల్లారేసరికల్లా

పాపం! నల్లబడిపోతాయ్