29 జూన్, 2009

అస్తిత్వం

నిన్న ఓ కవితని నిర్దాక్షిణ్యంగా
చించేశాను
రాలిపడి చెల్లాచెదరైన అ...క్ష...రా...లు...
మా అస్తిత్వం ఏమిటని మౌనంగా ప్రశ్నించాయ్
ఏం చెప్పను?
నేనూ ఓ అక్షరాన్నే

21 జూన్, 2009

...మురిపాల అరచేత మొగ్గతొడిగిందీ

"ఏవండోయ్! ఆ పుస్తకం మూసి ఓసారిలా వస్తారా..."

"ఎస్ మేడం"

"మీతో ఓ చిన్న పనిపడింది, చేస్తారా?"

"జీ హుజూర్!"

"ఇదిగో ఈ చేతికి మీరే పెట్టాలి..."

"ఓ! తప్పకుండా... It is my pleasure!"

"ఎందుకో అబ్బాయిగారికి అంత హుషారు?"

"అమ్మాయిగారి చేతికి సంకెళ్ళు వెయ్యాలంటే... యీ అబ్బాయిగారికి ఎప్పుడూ హుషారే మరి..."

"అవునా..."

"ఏం నీకు తెలీదా..."

"సరే అయితే మరి యిదిగో..."

"మరోసారి పాణిగ్రహణం... మళ్ళీ వచ్చిన వసంతం..."

"ఓహో...!"

"అదిగో... కోయిల కూడా కూసింది..."

"అబ్బో! అబ్బాయిగారికి కవిత్వం పొంగుకొస్తోందే..."

"అదంతా... ఈ అమ్మాయిగారి చేతి చలవే..."

"ఊఁ... కబుర్లాపి పని కానివ్వండి..."

"అలాగే...అలాగే..."

.......

"ఆ ఇంగ్లీషువాళ్ళకి బొత్తిగా ఈస్థటిక్ సెన్సు లేదు!"

"అదేంటి హఠాత్తుగా వాళ్ళమీద పడ్డారు?"

"లేకపోతే ఏంటి? బెండకాయల నెవరైనా ఆడవాళ్ళ చేతివేళ్ళతో పోలుస్తారా?"

"ఏం?"

"ఏమేంటి. అసలా పోలికేంటి? అదే మనవాళ్ళు చూడు... తామరరేకులతో పోల్చారు... పోలికంటే అది... మృదుత్వానికి మృదుత్వం... రంగుకి రంగు... అందానికి అందం... అన్నీ సరిగ్గా సరిపోయేట్టు..."

"ఆహాఁ... అలాగేం..."

"ఎందుకో ఆ మందహాసం?"

"మన పెళ్ళికాక ముందు ఒకసారి... యీ తామరరేకులు మీ సుకుమారమైన చెంపని తాకిన సంగతి గుర్తుకొచ్చి..."

"ఓహో! అప్పుడు నేనేం చేసానో కూడా గుర్తుందా?"

"లేకేం! కృష్ణార్జునయుద్ధంలో ఎన్.టి.ఆర్ పాడిన పద్యం పాడి వినిపించారు..."

"ఊఁ... అదీ సంధర్భోచితంగా మార్చి. చెల్వగు నీ కరపల్లవమ్ము మత్తనుపులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచు నే ననియెద..."

"అవునవును... ఆ గొంతు వినే కదా నేను పడిపోయింది..."

"పడిపోయావా! ఎక్కడ?"

"ఊఁ!... పూలబుట్టలో..."

"అవునా..."

"ఏం మీకు తెలీదా..."

........

"ఇదిగో వేళ్ళయిపోయాయి... ఇంక నీ అరచేతిలో ఏం పెట్టమంటావ్?"

"ఏం తెచ్చిపెట్టగలరేంటి?"

"నువ్వడగాలే కాని ఆ సూర్యుణ్ణయినా చంద్రుణ్ణయినా సరే తెచ్చిపెట్టనూ..."

"ఓస్ అంతేనా! అవేం వద్దు కానీ ఓ చక్కని పూలతీగల డిజైన్ వెయ్యండి చూస్తాను..."

"అమ్మో! అమ్మాయిగారు పెద్ద కోరికే కోరారు... అయితే కదలకుండా కూర్చోవాలి మరి..."

"మీరు అల్లరి చెయ్యకుండా బుద్ధిగా వేస్తే... నేనూ అలాగే కూర్చుంటాను..."

"ఊఁ...ఒకే మేడం..."

"అయ్యో, పూల తీగ మరీ అంత మందంగా ఉంటుందా!"

"కంగారు పడకు... నా గోటితో యీ తీగని సన్నగా దిద్దుతానుగా..."

"జాగ్రత్త... అసలే మీవి పదునైన గోళ్ళు..."

"ఇదిగో... అందుకే సున్నితంగా దిద్దుతునానుగా..."

"ఊఁ... మీ నైపుణ్యాన్ని ఒప్పుకుంటున్నాలెండి..."

........

"అబ్బా... కూర్చుని కూర్చుని నడుం నొప్పిగా ఉంది... ఇంకా ఎంతసేపూ..."

"అలా తొందరపడితే ఎలా... అందంగా రావద్దూ... అయినా... నా ప్రియభార్యకి నడుం నొప్పి రానిస్తానా...ఇదిగో ఇలా నా ఒళ్ళో తలవాల్చి హాయిగా కళ్ళుమూసుకో..."

"ఈ ఐడియా బాగుందే! కాస్త జరగండయితే..."

........

"బాపూగారు కనక ఇప్పుడు మనల్నీ ఫోజులో చూస్తే ఎంతందమైన బొమ్మ గీసేవారో కదా!"

"ఎంత బాపూగారైతే మాత్రం మన ఏకాంతానికి అడ్డువస్తే నేనూరుకోను..."

"అవునవును... పోనీ నేనే ఒక ఊహాచిత్రాన్ని గీసి అతనికి పంపిస్తాను..."

"ఇంతకీ మీరిప్పుడు గీస్తున్న చిత్రం ఎంతవరకూ వచ్చింది?"

"ఇదిగో అయిపోయింది చూడు..."

"అబ్బా...చాలా బాగా వేసారే..."

"థేంక్యూ..."

"చేతులు ఖాళీలేవు కాని లేకపోతే భుజం కూడా తడుదును..."

"మెచ్చుకోలు చూపించడానికి... చాలా మార్గాలున్నాయి..."

"అబ్బా...ఆశ..."

"ఏం...నా కళకి మెచ్చిన శ్రీమతిగారు... ఓ చిన్న బహుమతైనా ప్రసాదించరా..."

"బహుమతులన్నీ... భోజనం తర్వాత..."

"సరే అయితే పద..."

"ఇప్పుడెలాగా... ఇది ఎండి తీసేశాక అప్పుడూ..."

"ఎందుకు? నేనున్నాగా... ఇలాంటప్పుడు భార్యకి తన చేత్తో అన్నం తినిపించే అదృష్టం... ఎంతమందికి దొరుకుతుందీ... దాన్నెవరైనా వదులుకుంటారా..."

"ఓహో... సరే మీ అదృష్టాన్ని నేనెందుకు కాదంటాను...పదండి..."

"పద..."

16 జూన్, 2009

Synthesis


కాలాన్నెందుకలా క్షణాలుగా పొడి చేస్తావ్?
అప్పుడింక మిగిలేవి ఇసుక రేణువులే
నదిలోని ప్రతి బొట్టూ తాగాలని పేరాశ
ఒడిసిపట్టేవి దోసెడు, గొంతు దిగేవి
గుక్కెడు
నది నిన్ను వెక్కిరిస్తూ సాగిపోతుంది
పదాలుగా విరిచేస్తే...పాపం!
కవిత చచ్చిపోతుంది
నీకూ నాకూ మధ్య దూరం
విభజిస్తూ పోతే
అనంతం!
ఎన్నాళ్ళీ ఇరుకు గోడలు? బద్దలకొట్టేయ్ రాదూ!
నీ ఆలోచన తెగి
పడి ముక్కలుగా చెదరనీకు
ఒక నిరంతర తరంగమై
ఓ అఖండ నాదమై
ప్రసరించనీ
ప్రవహించనీ