21 అక్టో, 2011

రుధిరజ్యోత్స్న - నెత్తుటి వెన్నెల

.
" 'రుధిరజ్యోత్స్న' అబ్బ! ఎంత అందమైన పదమో కదూ!"

"నీ మొహం! నెత్తుటి వెన్నెల నీకు అందంగా కనిపిస్తోందా? అయితేగియితే భయంకరంగా కనిపించాలి!"

"నేను చెపుతున్నది 'రుధిరజ్యోత్స్న' గురించి 'నెత్తుటి వెన్నెల' గురించి కాదు"

"రెండూ ఒకటే"

"కాదు"

"ఎందుకు కాదు?"

"ఎందుకంటే రెండూ రెండు వేరేవేరే పదాలు కాబట్టి"

"వేరు పదాలయినా అర్థం ఒకటే కదా"

"నేనంటున్నది పదాల గురించి. వాటి అర్థం గురించి కాదు"

"నువ్వు మరీ వితండవాదన చేస్తున్నావ్"

"ఇందులో వితండం ఏముంది?"

"అర్థం కాకుండా పదం నచ్చడమేమిటి? అర్థం లేని మాట!"

"ఒక మనిషి గుణం ఎలాంటిదయినా, తన అందం నచ్చొచ్చుగా?"

"అసలైన అందం గుణంలోనే ఉంది"

"అది వట్టి బూటకపు మాట! అర్థంలాగానే గుణం కూడా సందర్భాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది"

"అందం కూడా ముసలితనంలో వాడిపోతుందిగా?"

"అవును, పదం కూడా వాడివాడి అరిగిపోతే ముసలిదైపోతుంది!"

"అయితే అర్థం కన్నా పదమే గొప్పదంటావా?"

"నేనలా అనలేదే!"

"మరి?"

"పదాన్ని పదంగా ప్రేమించ వచ్చంటున్నా"

"అర్థంతో సంబంధం లేకుండానా?"

"ఉండీ... లేకుండా..."

"ఏమిటో, నువ్వెప్పుడూ నాకు అర్థం కావు!"

"అయినా నువ్వు నన్ను ప్రేమించడంలా?"

"..."
.

7 ఆగ, 2011

కవిత్వ'మో'క్షణం

.
కవిత్వమేనేమో
కాదేమో
తెలియదు

భావమో
అభావమో
అసలే తెలీదు

ఒక శూన్యంలోంచి మరో లోతైన శూన్యంలోకి
ప్రయాణమే మో
ఏమో!

ఛత్... నీకింకా భాషా వ్యాయా
మోహం మొహంమొత్తలా?
నిర్మొహమాటంగా విసుక్కుంటాడు

నీ మెదడింకా
సరళరేఖాచంక్రమణం మానలేదు

నిరీహ క్షణాల్లోని నీడల మాటలేవీ?
కలల అలల్లో
విలవిలలాడే తెగిపడ్డ
చంద్రబింబం చెప్పిన రహస్యం
ఏమిటి?
ఎందుకో ఒకందుకని అందురూ
అనేదే
ఎండిపోయిన చెట్టుకొమ్మపై ఉడత
పరుగెందుకు?

ప్రశ్నోపనిషన్మత్తులో
చిత్తయిన
చిత్తభ్రమరం

లోలోపల రాలిపోయే చీకటి
చినుకుల్ని నోరారా త్రాగలేని
ఓ చాతకాని చాతకపక్షీ!

విను

ప్రతిక్షణ కణ
జననమరణ
రణంలో
మృత్యువొక అసంబద్ధ వాక్యం

ప్రతి కవితాచరణమూ చర్వితచర్వణమే
అందుకే యీ పదాంతంలోనే
కవిత్వారంభం
.

30 జులై, 2011

లాల పాట

నిద్దర అల

కల వల

తలపుల చేపల

గిలగిల.

కలగా పులగా లాలోచనల

కలవరింతల పలవరింతల పలకరింపుల

కిలకిల చిలకలకిలా,

పలుకుల ములుకుల సంకెల.

13 జూన్, 2011

లోపల...

ఒక కోవెల ఎదురుచూస్తూ ఉంది

దుమ్ముపట్టిన తన ముంగిలి అలికి ముగ్గు పెట్టేదెవ్వరని

నిస్తబ్దమై నిశ్శబ్దమై ఉన్న ప్రాంగణాన గణగణ గంటలు మ్రోగేదెన్నడని

ప్రక్కనున్న ముద్దమందారం రాల్చే పూలకి సార్థకత ఎపుడొస్తుందని

తను గర్భంలో దాచుకున్న

శిల

దైవంగా మారే క్షణం కోసం

ఒక కోవెల ఎదురుచూస్తూ ఉంది

నా కోసం...

2 జూన్, 2011

ఏమో!

అదృశ్యం అవ్వడమంటే?

ఉండీ కనపడకుండటమా

అసలు లేకుండా పోవటమా

కాక

దృశ్యంలో కరిగిపోవటమా


అలాగే మరి,

మౌనం అంటే?

27 ఏప్రి, 2011

వైకుంఠపాళి

నాలోపల ఒక సర్పం

వెన్నులోంచి పాకుతోంది

పాతాళం ఆకాశం

నిచ్చెనగా మారాలని

గడి గడినీ దాటుకుంటు

సుడుల ముడులు విప్పుకుంటు

వడివడిగా సాగుతోంది

సాగినకొద్దీ దూరం

రెట్టింపై పెరుగుతోంది

డస్సిపోయి వ్రస్సిపోయి

బుస్సుబుస్సు మంటోంది

అమృతానికి అర్రు సాచి

విషం కక్కుకుంటోంది

వేణునాద స్వరమేదో

వినిపించిందేమో మరి!

అంతలోనె పడగవిప్పి

పరవశించి ఆడుతోంది


పడుతూ లేస్తూ ఇంకా

ఎంతసేపు ఈ ఆట?


అంతదాక నిలిచేనా

గొంతులోన ఈ పాట?!

25 మార్చి, 2011

త్వరగా వచ్చేయరూ!

మిమ్మల్ని రైలెక్కించి వస్తున్నానా,

నడుపుతున్న హీరోహోండా తేలిగ్గా అనిపించింది

అలవాటైన బరువు లేక

ఏదో వెలితి

నా వెనక నువ్వున్నావన్న ధైర్యం

ముందు చుక్కానిలా నీ ప్రతిబింబం

లేకుండా,

యీ నావనెలా నడిపేది?

గతకలొస్తే జోరు తగ్గాలనే జాగ్రత్త

ఇప్పుడెలా వస్తుంది?

జంక్షనులో ఎక్కడైనా ఎర్రలైటు పడినప్పుడు

మీ మాటలు పూరించని

ఆ ఖాళీ క్షణాలు

ఎంత చిరాగ్గా అనిపించాయో తెలుసా

తెలిసిన దారే

అయినా తప్పిపోతానేమోనని కంగారు

ఒక జీవిత కాలమంత అనిపించిన ప్రయాణం

చివరికి, తెలిసిన గమ్యాన్నే

చేరుకుంది

అక్కడ నాకోసమే ఎదురుచూస్తూ

ఒంటరిగా నిశ్శబ్దంగా

చీకటిల్లు

లోపలికెళ్ళాలంటే ఏదో తెలీని దిగులు...

2 ఫిబ్ర, 2011

ఓడ మునిగిపోతోంది

మూసిన రెప్పల మాటున

నీకై అన్వేషణ

కనిపించని నా ప్రాణం

నీలో చూడాలని


నీ తాండవ నృత్యానికి

నా ఎదసడి తాళంగా

నిన్నూ నన్నూ కలిపే

అనాది రాగం ఏదో,

నాలోనే

ఏ మూలనో

సన్నగా...

శ్రుతి కలపాలని


ఎపుడో అదృశ్యమైన నా ప్రతిబింబం

తిరిగి హత్తుకోవాలని


దిక్కూ తెన్నూ లేక

లో సుడిగుండాలలో గుడుసుళ్ళను కొడుతూ

ఇంకా లోతుల్లోకి

అంతులేని అగాథాన...